Monday, November 1, 2010

ఐతే అది నిజమైతే !!!

కష్టాల్లో వున్న ఒక అమ్మాయికి అండగా నిలుస్తూ తన ఉన్నతి కోసం అనుక్షణం పాటుపడే ఒక స్నేహితుడు ఆమెకోసం ఒక వరుడిని చూశాడు. అతను అనుకున్నట్టుగా వాళ్ళిద్దరూ జంటగా కలిస్తే ఎంత అందంగా ఉంటుందో అని పాట రూపంలో మనకి చెప్తున్నాడు.

నాకు ఈ పాటలో బాగా నచ్చినదేంటంటే, సాధారణంగా ఎవరికైనా మనం ఏదైనా ఉపకారం చేస్తే తిరిగి ఏదో ఒకటి ఆశిస్తాం. కానీ ఇక్కడ ఆ స్నేహితుడు ఏమీ ఆశించకుండా తన స్నేహితురాలు జీవితం ఉన్నతంగా వుండాలని కోరుకోవడం. ఆ ఉన్నతిని నిజాయితీగా ఆనందించడం. ఇలాంటి వాళ్ళు సినిమాల్లో తప్ప బయట కనిపించరనుకోండి అది వేరే విషయం.

ఈ పాటలోని పోలికలు నాకు చాలా ఇష్టం.

"ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే .. అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే.. "
పున్నమి వెన్నెల్లో విచ్చుకున్న పువ్వులు గాలికి ఊగుతూ నవ్వుతున్నట్టు అనిపించే క్షణం అనుభవించిన వాళ్ళకి అనిపిస్తుంది, ఇంతకన్నా ఏమి కావాలి జీవితానికి అని. వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకుంటే వాళ్ళ ఇల్లు ఎల్లప్పుడూ అలానే వుంటుంది అనే భావన.

"ఆ నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నా"
ఒక సంస్థ అధిపతిగా ఉన్నత స్థానంలో వున్న అతనికి, అతని దగ్గర పనిచేసే ఆమెకి మధ్య అంతస్థుల్లో ఎంత తేడా ఉన్నా వాళ్ళని కలపడానికి రాయబారిని నేను అవుతా.

"చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింతే పున్నమిగా
ఆ చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింతే పున్నమిగా"
అతను ఒప్పుకుంటే వెన్నెల కురిసినపుడు కలువ పూవు పొందే ఆనందం ఆమె పొందుతుందని, అదే ఆమె ఒప్పుకుంటే అతని ముఃఖం పున్నమి చంద్రునిలా ప్రకాశిస్తుంది.

"నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళా చేరువైతే"
అతని ఆశలు అలా అలా ఆకాశానికి వెళ్ళి తరలతో కలిసి వాళ్ళ పెళ్ళికి తలంబ్రాలుగా కురిసే వేళ వాళ్ళిద్దరూ చేరువైతే.

"రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
ఆకసాన అరుధంతి నక్షత్రం తెలిపింది ఇదేనని సుముహూర్తం"
స్త్రీ సహజమైన సిగ్గుతో చాటుగా ఆమె, అలాంటివేమి లెకుండా అతను చూసుకుంటూ చూపులతోనే రాయని శుభలేఖలు రాసుకుంటున్న ఈ సమయం కన్నా ఇంక సుముహూర్తం లేదని ఆకాశంలో వున్న అరుధతీ దేవి నిర్ణయించేసిందంట.

"మనసిచ్చిన మలిసంద్యలు కుంకుమలై కురిసి నుదుట తిలకమై మెరిసే వేళా చేరువైతే"
సంధ్యాసమయం కనిపించే అరుణవర్ణం ఆమె నుదుట అతను దిద్దిన కుంకుమై మెరిసే వేళా వాళ్ళిద్దరూ చేరువైతే !!!

చిత్రం: శుభలేఖ
రచన: వేటూరి


ఐతే అది నిజమైతే అదే నిజమైతే
ఐతే అది నిజమైతే అదే నిజమైతే
ల ల ల ల ల ల లా ల
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే
అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే .. ఐతే

నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింతే పున్నమిగా
నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళా చేరువైతే.. ఐతే

రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
ఆకసాన అరుధంతి నక్షత్రం తెలిపింది ఇదేనని సుముహూర్తం
మనసిచ్చిన మలిసంద్యలు కుంకుమలై కురిసి నుదుట తిలకమై మెరిసే వేళా చేరువైతే .. ఐతే
PS : ఇదే మొదటిసారి నేను ఒకపాట గురించి రాయడం. తప్పులు వున్నా, చెప్పిన విషయం క్లియర్ గా లేకపోయినా క్షమించేసి తప్పులు చెప్తే కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.

3 comments:

  1. ఆ ఉన్నతిని నిజాయితీగా ఆనందించడం. ఇలాంటి వాళ్ళు సినిమాల్లో తప్ప బయట కనిపించరనుకోండి అది వేరే విషయం. :P
    మొదటి కామెంట్ నాదే :)

    బద్రి బావుంది..నాకైతే నచ్చింది.. మరిన్ని పాటలను పరిచయం చెయ్యాలని కోరుకుంటూ

    ReplyDelete
  2. బాగుంది బద్రిగారు బాగారాశారు.

    ReplyDelete